- లలితగీతాల రచన ఎలా ప్రారంభమయ్యింది?
- 20వ శతాబ్దం తొలిదశలో మన దేశంలో అనేక ఉద్యమాలు చోటుచేసుకున్నాయి.
- ఆంగ్ల విద్యాబోధన మొదలైన తర్వాత Keats, Shelly, Wordsworth మొదలైన ఆంగ్ల కవుల ప్రభావం మన యువ కవులపై పడి "భావ కవితా ఉద్యమానికి" దారితీసింది.
- ఛందోబద్ధమైన పదాలు, పరుష వాక్యాలకు బదులుగా ప్రకృతి సంబంధమైన ఇతివృత్తాలు, సరళమైన పదాలు, సున్నితమైన భావాలు కవితావస్తువులుగా మారాయి.
- 1910 లో గురజాడ అప్పారావుగారు రాసిన "దేశమును ప్రేమించుమన్నా" మొట్టమొదటి లలితగీతంగా సాహిత్యకారులచే నిర్ణయించబడింది.
- లలితగీతం - లక్షణం
- భావం + మనోరంజకమైన రాగం = లలితగీతం
- స్వరం + పదం = లలితగీతం
- మాట + పాట సమపాళ్ళలో మేళవించి హృదయాన్ని రంజింపజేసేది లలితగీతం.
- మనసులో కలిగే భావాలు గీతంగా మారితే, వాటికి మంజులమైన స్వరాలు జోడించి మధురమైన అమృతధారగా ప్రవహింపజేసేది సంగీతం.
- గీతం + సంగీతం = విన్నవారికి రసస్ఫూర్తి, మధురానందం.
- లక్షణగీతం:
ప) మనసున పూచే తీయని ఊహల
మాలికయే మృదుగీతం
మధుర మనోహర మంజుల నాద
సుధాఝరియే సంగీతం
గీతం - సంగీతం నవరసభావ భరితం
చ1) మాటలో నిండు నుడికారం
పాటలోని సుస్వరసారం
స్వరపద సౌరభ సుమహారం
సుందరగీతికి శ్రీకారం
చ2) పాటలోని రసభావం
మేటి గళములో జీవం
వివిధవాద్య సహకారం
కలగలసిన సాకారం
అదియే లలితగీతం
గానమే లలితసంగీతం
గీత సంగీత సంగమం
రసికజన చిత్తరంజనం
- మనసులో కలిగే భావం సంతోషం, విషాదం, జుగుప్స ఇలా ఏదైనాసరే, వాటికి మంజులమైన స్వరాలు జోడించి గీతంగా మారితే, వినేవారికి కలిగే భావం చివరకు ఆనందమే.
- లోకంలోని శోకహర్షాల కారకాలే కావ్యనాటకాల్లో కూడా ఉన్నప్పటికీ, చివరకు కలిగే అనుభూతి ఆనందమే అవుతుంది అని తత్త్వవేత్త Aristotle లాంటివారు కూడా అంగీకరించారు.
- మృదుగీతం = లలితము, కోమలము అయిన లలితగీతం.
- గీతం అంటే మంజులం, మనోహరం అయిన సంగీతం.
- లలితగీతం, సంగీతం నవరసాలు ఆలవాలం అయినవి. ఉద్భటుడు ఈ కిందివాటిని నవరసాలుగా పేర్కొన్నాడు.
- శృంగారము
- హాస్యము
- కరుణ
- రౌద్రము
- వీరము
- భయానకము
- భీభత్సము
- అద్భుతము
- శాంతము
శృంగార హాస్య కరుణా రౌద్రవీర భయానకాః
భీభత్సాద్భుత శాంతాశ్చ నవనాట్య రాసాః స్మృతాః
- శాస్త్రీయసంగీతంలో నవరసాలు సంబంధించిన రచనలు అరుదు (కథావస్తువు గల "నౌకా చరిత్రము", "ప్రహ్లాద భక్త విజయము" వంటివి తప్ప). ఎక్కువగా కనిపించేవి భక్తి , శృంగార రసాలు.
- శృంగారంలో కూడా నాయికానాయక భావంతో "మధురభక్తి" ఎక్కువగా కనిపిస్తుంది.
- లలితగీతాల్లో కనిపించినంత విరివిగా జానపదసంగీతంలో కూడా నవరస ప్రయోగం లేదు.
- పల్లెల్లో వివిధ సందర్భాల్లోనూ, వేడుకల్లోనూ, పండుగల్లోనూ జాతర్లలోనూ జానపదులు వారివారి మనోభావాలకు అనుగుణంగా ఆశువుగా పాడుకొనే పాటల్లో శృంగార, హాస్య, కరుణ రసాలు ఎక్కువగా కనిపిస్తాయి. మిగిలిన రసాలు అరుదు.
- లలిత సంగీతంలో భావప్రాధాన్యత అధికంగా ఉంటుంది. తత్సంబంధిత రసపోషణకు అవకాశం ఉంటుంది.
- లలిత సంగీతంలో సాహిత్యం రసభావభరితం. నుడికారం ఊపిరి. సంగీతం ప్రాణం.
- లలితగీతం రక్తికట్టాలంటే ఇవి అవసరం:
- భావం
- పదం
- వాటికి తగ్గ రాగం
- వీటన్నిటికీ జీవం పోసే గళం
- అందుకు తగ్గ వాద్యసహకారం
No comments:
Post a Comment