Showing posts with label Carnatic music exams. Show all posts
Showing posts with label Carnatic music exams. Show all posts

Monday, 18 May 2026

Characteristics of Sankarabharanam Raaga - శంకరాభరణ రాగ లక్షణములు

 ఇది 29వ మేళకర్త రాగము. కటపయాది సంఖ్యలో ఇముడ్చుటకు ఈ రాగమునకు ముందు “ధీర” అను పదము చేర్చబడి “ధీరశంకరాభరణము” అయినది.

ఇది “బాణ” అను 5వ చక్రములోని 5వ రాగము.

ఆరోహణ సరిగమపదనిస.

అవరోహణ సనిదపమగరిస

శృతులు: షడ్జము, చతుశృతి రిషభము, అంతర గాంధారము, శుద్ధమధ్యమము, పంచమము, చతుశృతి దైవతము, కాకలి నిషాదము

లక్షణములు: సంపూర్ణ రాగము. అన్ని స్వరములూ రాగచ్ఛాయాస్వరములు. ససరిరిగగమమ అను జంటలును, పదనిపద, మపగమరి అను దాటువులును ప్రసిద్ధ అలంకారములు. చాలా వ్యాప్తిలోగల రాగము. ఎల్లప్పుడూ పాడదగిన రాగము. శ్లోకములు, పద్యములు పాడవచ్చును. రాగాలాపన విస్తృతముగా చేయుటకు తగిన రాగము. అన్ని రకములైన రచనలు చేయుటకు రచింపబడిన రాగము. చాలా జన్యరాగ సంతతిగల జనకరాగము. సంగీతరత్నాకరమునందు చెప్పబడిన రాగము. హిందుస్తానీ సంగీతములో ఈ రాగమునకు “బిలావల్” అని పేరు. షడ్జము, మధ్యమము, పంచమములలో రచనలు ప్రారంభించబడును. సదపమగరిస అనునది రంజక ప్రయోగము.

రచనలు:

గీతము: గోవిందాచ్యుత - మఠ్యతాళము - పురంధరదాసు

వర్ణము: సామినిన్నే - ఆదితాళము - వీణ కుప్పయ్యర్

కృతి:

స్వరరాగసుధ - ఆదితాళం - త్యాగరాజు

సరోజదళనేత్రి - ఆదితాళం - శ్యామశాస్త్రి

మనసు స్వాధీనమైన - చాపుతాళం - త్యాగరాజు

ఎందుకు పెద్దలవలె - ఆదితాళం - త్యాగరాజు

కీర్తన:

అలరులు కురియగ - ఆదితాళం - అన్నమయ్య


Characteristics of Naatakuranji Raaga - నాటకురంజి రాగ లక్షణములు

 ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగజన్యము.

ఆరోహణ సరిగమనిదనిపదనిస.

అవరోహణ స.నిదమగమపగరిస


శృతులు: షడ్జము, చతుశృతి రిషభము, అంతర గాంధారము, శుద్ధమధ్యమము, పంచమము, చతుశృతి దైవతము, కైశికి నిషాదము

లక్షణములు: పంచమము అరుదైన స్వరమైనప్పటికీ, నిదనిపదనిస., సరిగమపగరిస అను సంచారములలో వచ్చును. వక్ర సంపూర్ణ రాగము. నిదనిపదనిస. ప్రయోగము కొత్త శోభనిచ్చును. ఉపాంగరాగము. గాంధార, మధ్యమ, దైవత, నిషాదములు రాగఛ్చాయాస్వరములు. గమకవరికరక్తిరాగము. ప్రత్యాహత గమకములు ఈ రాగమునకు అలంకారములు. సాయంకాలములో పాడదగు రాగము.

రచనలు:

వర్ణము: చలమేల - ఆదితాళము - మారైపట్టం రంగస్వామి

కృతి:

పరాతీత సరస్వతి - రూపకతాళం - తిరుపతి నారాయణస్వామి

మనసు విషయనట - ఆదితాళం - త్యాగరాజు

నవగ్రహ కీర్తన:

బుధమాశ్రయామి - ఝంపెతాళం - దీక్షితార్


Characteristics of Darbar Raaga - దర్బార్ రాగ లక్షణములు

 ఇది 22వ మేళకర్త అయిన ఖరహరప్రియ రాగజన్యము.

ఆరోహణ సరిమపదనిస.

అవరోహణ సనిదపమరిగాగారిస

శృతులు: షడ్జము, చతుశృతి రిషభము, సాధారణ గాంధారము, శుద్ధమధ్యమము, పంచమము, చతుశృతి దైవతము, కైశికి నిషాదము

లక్షణములు: ఇది షాడవ వక్ర సంపూర్ణ రాగము. దీర్ఘగాంధారము ఈ రాగమునకు అత్యంత శోభనిచ్చును. గాంధార నిషాదములు రాగచ్చాయా స్వరములు. గమకవరికరక్తిరాగము. ఉపాంగ రాగము, ఎల్లప్పుడూ పాడదగిన రాగము.

సంచారము: మపదనిస.పా - దనిపామదపమరీ - గారిసరిపమపా - దపమపదనిసా - రిపమరిగారిసా - నిరిసనిసదాప - మపదనిపా - మదపమగరీ - గారిసా

రచనలు:

వర్ణము: చలమేల - ఆదితాళం - వీణ కుప్పయ్యర్

కృతి: యోచన - ఆదితాళం - త్యాగరాజు

ముందువెనుక - చాపుతాళం - త్యాగరాజు

అపరాధముల మాన్పి - ఖండచాపు - పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్


Characteristics of Hamsadhwani Raaga - హంసధ్వని రాగ లక్షణములు

 ఇది 29వ మేళకర్త అయిన ధీరశంకరాభరణ రాగజన్యము.

ఆరోహణ సరిగపనిస.

అవరోహణ స.నిపగరిస

శృతులు: షడ్జము, చతుశృతి రిషభము, అంతర గాంధారము, పంచమము, కాకలి నిషాదము

లక్షణములు: ఔడవ రాగము, ఉపాంగరాగము, మధ్యమ దైవతములు ఈ రాగములో వర్జ్యములు. ఈ రాగమును రామస్వామిదీక్షితులు కనిపెట్టిరి. గాంధార నిషాదములు జీవస్వరములు. నిగ.రి. స. - నిరి.స.ని - పస.నిప - గనిపగారి - పగరిస - రిపగరిసా అను దాటువులు ప్రసిద్ధ అలంకారములు. అన్నివేళలా పాడదగిన రాగము. సభారంభమున పాడదగిన రాగము.

సంచారము: గపనిసా - పనిస.రి.గ.రి. - గ.ప.గ.రి.సా. - నిస.రీ.స.నిప - గపనిస.నీప - గనిపగారి - సరిగపనిసా. - పనీగపారిగా - సరిగపగారిసా - .ని.పసా

రచనలు:

వర్ణము: జలజాక్షి - ఆదితాళం - వెంకట సుబ్బయ్యగారు

కృతులు:

రఘునాయక - ఆదితాళం - త్యాగరాజు

శ్రీ రఘుకుల - ఆదితాళం - త్యాగరాజు

వాతాపిగణపతిం - ఆదితాళం - దీక్షితార్

కీర్తన: గజవదనా - ఆదితాళం - పురంధరదాసు

Characteristics of Vasantha Raaga - వసంతరాగ లక్షణములు

 ఇది 17వ మేళకర్త అయిన సూర్యకాంత రాగజన్యము.

ఆరోహణ సగమదనిస.

అవరోహణ స.నిదమగరిస


శృతులు: షడ్జము, శుద్ధ రిషభము, అంతర గాంధారము, శుద్ధమధ్యమము, చతుశృతి దైవతము, కాకలి నిషాదము

లక్షణములు: ఔడవ షాడవ రాగము, వర్జ్యరాగము. ఆరోహణలో రిషభ పంచమములు వర్జ్యములు. అవరోహణలో పంచమము మాత్రం వర్జ్యము. గాంధార మధ్యమ దైవతములు రాగచ్ఛాయా స్వరములు. గమకవరిక రక్తిరాగము. ప్రసిద్ధ రాగము. దేశీయరాగము. ఎల్లప్పుడూ పాడదగిన రాగము. సాయంసమయమున పాడుట సమంజసము. కర్ణాటకసంగీతములో లలితరాగమునకు దీనికి దగ్గర పోలిక కలదు. పంచమ వర్జ్య రాగములలో ఇది ఒకానొక ప్రముఖ రాగము. స.గ.రి.స.నిద - దస.నిదమగ - గదమగరిస వంటి దాటువులు ప్రసిద్ధములు.

సంచారము: స.నిదమగా - మగరిసా - .నిస.నిస మామ - గమదా - దనిస.రి.సా. - స.గ.రి.స.నిదా - దనిస.నిదమా - మదనిదమగా - మాగరిసా - .ద.నిసా

రచనలు:

వర్ణం: నిన్నుకోరి - ఆదితాళం - వీణ కుప్పయ్యర్

కృతులు:

సీతమ్మ మాయమ్మ - రూపకతాళం - త్యాగరాజు

రామచంద్ర భావయామి - రూపకతాళం - దీక్షితార్

అష్టపది: లలిత లవంగ - ఆదితాళం - జయదేవుడు

Characteristics of Sri Raagam - శ్రీరాగ లక్షణములు

 ఇది 22వ మేళకర్త అయిన ఖరహరప్రియ రాగజన్యము.

ఆరోహణ సరిమపనిస.

అవరోహణ స.నిపదనిపమరిగరిస


శృతులు: షడ్జము, చతుశృతి రిషభము, సాధారణ గాంధారము, శుద్ధమధ్యమము, పంచమము, చతుశృతి దైవతము, కైశికి నిషాదము

లక్షణములు: ఔడవ వక్ర సంపూర్ణ రాగము. ఆరోహణమునకు గాంధారదైవతములు వర్జ్యములు. ఘనరాగపంచకములో ఐదవ రాగము. పూర్వ ప్రసిద్ధ మేళములలో ఒకటి. దీనిని ప్రాచీనులు మేళకర్తగా తీసుకొనిరి. అల్పదైవతమును ఉపయోగించు రాగము. అనగా, ఈ రాగములో దైవతము చాలా తక్కువగా ఉపయోగించబడును. వెంకటమఖి సంప్రదాయములో దీనిని 22వ మేళకర్తగా తీసుకొనిరి. ఉపాంగరాగము. రిషభ, గాంధార, నిషాదములు రాగచ్ఛాయాస్వరములు. మంగళకరమైన రాగము. మిట్టమధ్యాహ్నము పాడుటకు తగిన రాగము. కానీ ఎల్లవేళల పాడుటకు తగినది. రిపమనిపస.నిరి. - స.రి.నిస.పనిమప అను దాటువులు ప్రసిద్ధములు. రిగరిస - పదనిపమ అనునవి రంజక ప్రయోగములు.ఈ రాగమును మధ్యమావతి బదులుగా గానసభానంతరము పాడుట కలదు. అన్ని దోషములు పారద్రోలుటకై పాడబడును.

సంచారము: పనిసా.నిపా - మపనిపమరీ - రిగరిసా - .నిసరిమపా - మపనీ - పనిస.నిసా - నిస.రి.గ.రి.సా. - నిరి.స.నిపా - రి.స.నిస.నిపా - పదనిపమరీగరిసా

రచనలు:

వర్ణము: సామినిన్నే - ఆదితాళం - కరూర్ దేవుడు అయ్యర్

గీతము: మీనాక్షి జయ కామాక్షి - ధ్రువతాళము - పైడాల గురుమూర్తిశాస్త్రి

కృతి: శ్రీవరలక్ష్మీ నమోస్తుతే - రూపకతాళం - దీక్షితార్

పంచరత్నకీర్తన: ఎందరో మహానుభావులు - ఆదితాళం - త్యాగరాజు

Characteristics of Sri Ranjani Raaga - శ్రీరంజని రాగ లక్షణములు

 ఇది 22వ మేళకర్త అయిన ఖరహరప్రియ రాగజన్యము.

ఆరోహణ సరిగమదనిస.

అవరోహణ స.నిదమగరిస


శృతులు: షడ్జము, చతుశృతి రిషభము, సాధారణ గాంధారము, శుద్ధమధ్యమము, చతుశృతి దైవతము, కైశికి నిషాదము

లక్షణములు: షాడవ రాగము. ఉపాంగ రాగము. ఆరోహణ అవరోహణములయందు పంచమము వర్జ్యస్వరము. కరుణరస ప్రధానమైన రాగము. కర్ణాటకసంగీతమున గల అనేక ముఖ్య రాగములలో ఇది ఒకటి. ప్రాచీనరాగము. సాధారణంగా మధ్యమ నిషాదములతో రచనలు ప్రారంభించబడును.

సంచారము: గమదా - మదనీసా. - దనిస.రి.గ.రి.స.నిద - మదనిస.నిద - మనిదమ - దమగరిగా - రిగమదనీస.నీదమాగరి - మగరిసా - .ద.నీసా


రచనలు:

కృతులు: మారుపల్కకున్నావేమిరా - ఆదితాళం - త్యాగరాజు

భువిని దాసుడనే - ఆదితాళం - త్యాగరాజు

సొగసుగా మృదంగతాళము - రూపకతాళం - త్యాగరాజు

లక్షణగీతము: అరెరే జయజయ - త్రిపుటతాళం - గోవిందాచార్య

Characteristics of Hindola Raaga - హిందోళరాగ లక్షణములు

 ఇది 20వ మేళకర్త అయిన నఠభైరవి రాగజన్యము.

ఆరోహణ సగమదనిస.

అవరోహణ స.నిదమగస

శృతులు: షడ్జము, సాధారణ గాంధారము, శుద్ధమధ్యమము, శుద్ధ దైవతము, కైశికి నిషాదము

లక్షణములు: ఔడవ రాగము, ఉపాంగ రాగము. ఆరోహణ అవరోహణములు రెండింటిలోను రిషభ పంచమములు వర్జ్యములు. మధ్యాహ్న సమయమందు గానము చేయుట తగును. మధ్యమము, దైవతము, నిషాదము రాగచ్చాయాస్వరములు.

సమగమ - గమనిద - మదనిస. - స.నిదమగస అనునవి రంజకమైన ప్రయోగములు. కొన్ని ప్రాచీన లక్షణ గ్రంథములలో ఈ రాగము 22వ మేళకర్త ఖరహరప్రియ రాగజన్యముగా చెప్పియున్నందువలన కొందరు సుప్రద్ధ సంగీత విద్వాంసులు చతుశృతి దైవతమును వాడుచున్నారు. సగసమగ - మదనిద - స.నిగ.స. అను దాటువులు, గగమమదదనిని అను జంటలు, స.ని నిద దమ మగ గస అను ప్రత్యాహత గమకాలు ఈ రాగములో ప్రసిద్ధములు.

సంచారము: గమనీద - దనీస. - నిస.మ.గ.స. - నిగ.స.నిద - మదనిసా. - నిదమ - గమనిదమగ - మగసా - .ద.నీ.సా

రచనలు:

కృతులు: సామజవరగమనా - ఆదితాళం - త్యాగరాజు

మనసులోని మర్మమును - ఆదితాళం - త్యాగరాజు

నీరజాక్షి కామాక్షి - రూపకతాళం - దీక్షితార్

కీర్తన: కొండలలో నెలకొన్న - ఆదితాళం - అన్నమయ్య

Characteristics of Thaana Varnam - Theory - తానవర్ణ లక్షణములు

  • రాగభావసమన్వితమై, మధురరసపూరితమగు పాండిత్య ప్రతిభగల రచన ‘తానవర్ణం’ అనబడును. దీనిలో విశేషమైన సంగీత ప్రాముఖ్యత ఉండును.

  • వర్ణములు రచించుటకు అద్భుతమైన శక్తి, నైపుణ్యం అవసరం. కనుకనే, వర్ణరచయితలు బహుకొద్దిమంది మాత్రమే కలరు.

  • తానము అనగా స్వర ప్రస్తారము.

  • చతుర్విధ వర్ణములపై ఆధారపడిన అలంకారవిశేషముచేత ఈ రాగములకు ఒక రంజకమైన రూపము ఏర్పడుచున్నది.

  • తానవర్ణ రచనలో రాగప్రస్తారము ప్రధాన అంశము. తానము స్వరప్రస్తారమును గుర్తించుటయే కాక, మనోధర్మసంగీతములోని విభాగములలో ఒకటైన మధ్యమకాలమును కూడా గుర్తించుచున్నది.

  • రాగాలాపన ప్రదర్శించిన తర్వాత, ఆ రాగరూపమును మధ్యమకాల సంచారములో పాడుచూ విస్తరించుట పరిపాటి. అదియే తానము.

  • ఈ మధ్యమకాల నడక తానవర్ణముయొక్క ప్రత్యేక నడక. తానవర్ణములలో ప్రతియొక్క స్వరప్రస్తారము విపులముగా పాడవలెను. ఇది తానవర్ణ విశేషము.

  • వర్ణము అభ్యాసగాన రచనలలో చాలా ముఖ్యమైనది. ఈ రచనలు నేర్చుకొనుటయు, పరిపూర్ణపరిపక్వముతో పాడుటయు చాలా కష్టము. వర్ణమును బాగుగా నేర్చినయడల ఇతర రచనలు అతిసులభసాధ్యమగును.

  • వర్ణమునందుగల సాహిత్యము చాలా తక్కువగాను, అంతగా ప్రాముఖ్యత లేకయు ఉండును.

  • సాహిత్యము భక్తిరస ప్రధానముగా గానీ, శృంగారరస ప్రధానముగా గానీ ఉండును. దైవస్తుతి రూపముగా గానీ, ఒక రాజపోషకుని స్తుతి రూపముగా గానీ ఉండును.

  • ఇది ధాతుప్రధాన రచన.

  • సాహిత్య సారాంశము అనేక తానవర్ణములలో నాయికానాయకభావముతో కనిపించును. వర్ణమునకు రెండు భాగములున్నవి.

  1. పూర్వాంగము

  2. ఉత్తరాంగము

  • పల్లవి, అనుపల్లవి, ముక్తాయిస్వరము కలిసి పూర్వాంగమగును. చరణము, చరణస్వరము కలిసి ఉత్తరాంగమగును.

  • పూర్వాంగములోని పల్లవి అనుపల్లవులకు మాత్రమే సాహిత్యముండును. ముక్తాయిస్వరములో సాహిత్యముండదు.

  • ఉత్తరభాగములోని చరణమునకు ఎత్తుగడ పల్లవి, ఉపపల్లవి, చిట్టపల్లవి అని పేర్లు కలవు. ఇందు చరణమునకు సాహిత్యముండును.

  • సాధారణముగా మొదటి చరణస్వరము దీర్ఘముగా ఉండును. నాలుగైదు చరణస్వరములతో వర్ణము రచించుట వాడుక.

  • చరణస్వరమును పాడి, చరణము అందుకొనుట ఆచారము. అనుపల్లవి మాత్రమే వాగ్గేయకారుల అభిప్రాయమునుబట్టి రెండు లేక నాలుగు ఆవృత్తములుండును.

  • రెండవ చరణస్వరము ఒకటి లేదా రెండు ఆవృత్తములుగా ఉండును.

  • మూడవ స్వరము సర్వలఘుస్వరముగా ఉండును. ఇది రెండు లేక నాలుగు ఆవృత్తములుగా ఉండును.

  • చివరి స్వరము మిగిలిన అన్ని స్వరములకంటే కఠినశైలిలో కనబడును. విస్తారమైన ఆలాపన చేయుటకుగల ముఖ్యమైన రాగములు పంచమకాలంలో మిక్కిలి ప్రకాశించు రాగములు, భావరసప్రధానమైన రాగములు తానవర్ణ రచనకు ప్రధానమైన రాగములుగా ప్రత్యేకించబడినవి.

  • ఆది, ఝంపె, ఖండ అట తాళములలో తానవర్ణములు రచించవచ్చును. చాపుతాళంలో వర్ణములు రచించుట అసమంజసము.

వర్ణములు రెండు రకములు. అవి

  1. తానవర్ణములు

  2. పదవర్ణములు

రచయితలు:

  • వీణకుప్పయ్యర్

  • పచ్చిమిరియం ఆది అప్పయ్య

  • స్వాతి తిరుణాళ్ మొదలగువారు

The Thirteen Characteristics of Ragas - రాగత్రయోదశ లక్షణములు

 మన సంగీతంలో మేళమునకు రాగమునకు మధ్య భేదము కలదు. మేళములు సప్తస్వరసమ్మేళనములు. మేళమునందు స్వరములకు కొన్ని లక్షణములను చేర్చి భావదృష్టితో పాడినచో, అది రాగము. ఈ రాగమునకు భరతముని 10 లక్షణములను, శ్యామదేవుడు 13 లక్షణములను చెప్పిరి. ఇవి దశవిధ త్రయోదశ లక్షణములుగా పరిగణింపవచ్చును. అవి:

  1. గ్రహము

  2. అంశము

  3. తారము

  4. మంద్రము

  5. న్యాసము

  6. అపన్యాసము

  7. అల్పత్వము

  8. బహుత్వము

  9. షాడవము

  10. ఔడవము

ఈ పది లక్షణములకు,

  1. సన్యాస

  2. విన్యాస

  3. అంతర్మార్గములను చేర్చి శ్యామదేవుడు 13 లక్షణములని చెప్పిరి.

1) గ్రహము: ఒక రాగముగానీ లేక అందుగల సంగతులుగానీ మొదట ఏ స్వరముతో ప్రారంభించబడుతున్నవో, ఆ స్వరమును గ్రహము లేక గ్రహస్వరము అందురు.

2) అంశము: ఒక రాగముగానీ, లేక సంగతులుగానీ పాడునప్పుడు ఆ రాగకళను మాటిమాటికీ చూపుటకై ప్రయోగించబడి, రంజకమై, ముఖ్యమైన స్వరమును అంశస్వరము లేక జీవిస్వరము అని అందురు.

3) తారము: ఒక రాగముగానీ, లేక సంగతులుగానీ, హెచ్చుస్థాయి స్వరముతో పాడుటనే తారము లేక తారగతి అందురు.

4) మంద్రము: ఒక రాగముగానీ, లేక సంగతులుగానీ, తగ్గుస్థాయి స్వరముతో పాడుటనే మంద్రము లేక మంద్రగతి అందురు.

5) న్యాసము: రాగమునందుగానీ, లేక సంగతులుగానీ పాట చివర ముగించు స్వరముమీద నిలుపుచుండుదానిని న్యాసము లేక న్యాసస్వరము అందురు.

6) అపన్యాసము: రాగమునందుగానీ, లేక సంగతులుగానీ పాడునప్పుడు మధ్యమధ్య ముగించు స్వరమును అపన్యాసము లేక అపన్యాసస్వరము అందురు.

7) అల్పత్వము: ఒక రాగమును పాడునప్పుడు ఏదైనా ఒక స్వరమును అధికముగా ఉచ్చరింపబడకుండుటను అల్పత్వము అందురు.

ఇవి రెండు రకములు:

  • లంఘనము: ఒక రాగమును పాడునప్పుడు ఒక స్వరమును ఏమాత్రము ఉచ్చరింపక విడిచి, దానిమీద స్వరమును దాటుట లంఘనము అనబడును.

  • అనభ్యాసము: ఏదైనా ఒక రాగము పాడుటలో ఒక స్వరమును మాటిమాటికీ ఉచ్చరింపక, ఏదైనా ఒక సమయమున అల్పముగా ఉచ్చరించుటను అనభ్యాసము అందురు.

8) బహుత్వము: ఒక రాగమును పాడునప్పుడు ఒకే స్వరమును మాటిమాటికీ గ్రహించి పాడుటను బహుత్వము అందురు. ఇది రెండు విధములు:

  • అలంఘనము: ఒక రాగమును పాడునప్పుడు ఒకే స్వరము విడువక పాడుటను అలంఘనము అందురు.

  • అభ్యాసము: ఒక రాగమును పాడునప్పుడూ ఒకే స్వరమును ఎడతెగకనైనను, మాటిమాటికైనను ఉచ్చరించుటను అభ్యాసము అందురు.

9) షాడవము: ఆరోహణమునందు, అవరోహణమునందు రెండిటియందును ఆరు స్వరములు కలిగియుండుటను షాఢవము అందురు.

10) ఔడవము: ఆరోహణమునందు, అవరోహణమునందు రెండిటియందును ఐదు స్వరములు కలిగియుండుటను షాఢవము అందురు.

11) సన్యాసము: ఒక రాగమును పాడునప్పుడు, దానిని సమఖండములుగా భావించబడి ఒకొక్క ఖండమును ముగించు స్వరమును సన్యాసము లేక సన్యాసస్వరము అందురు.

12) విన్యాసము: ఒక రాగమును పాడునప్పుడు, దానిని పలు ఖండములుగా చేసి, ఆయా ఖండములలో ఆ రాగకళను చూపుటకై మాటిమాటికీ ఖండావయవముగా వచ్చు స్వరమును విన్యాసము అందురు.

13) అంతర్మార్గము: దీనినే అంతర్గతమార్గము అందురు. రాగమునకు ఇతర స్వరములుగానీ, లేక అన్యస్వరముగానీ ప్రవేశపెట్టుటయగును. భాషాంగరాగమను పేరు వాడుకలో లేని ప్రాచీనకాలములో అంతర్మార్గమని పేరు. ఇట్లు చేయునప్పుడు రంజకముగాను, రాగ అలంకారములు చెడకుండునట్లు చూడవలయును.

Life History of Sri Tiruvotriyoor Thyagaiyer - జీవితచరిత్ర - తిరువత్తియూర్ త్యాగయ్యర్

  • ఇతడు 18-19 శతాబ్దాలకు చెందినవాడు.త్యాగరాజుకు ముఖ్యశిష్యుడు. తమిళబ్రాహ్మణుడు.
  • మద్రాసులోని తిరువత్తియూర్ నందు జన్మించుటచే “తిరువత్తియూర్ త్యాగయ్య” అని పిలువబడును.
  • ఇతడు ఘనరాగపంచకము మొదలైన 108 రాగములలో అతిభక్తిపూరితమైన కీర్తనలు రాసి, “సంకీర్తన రత్నావళి” అను గ్రంథమును రచించిన ప్రతిభావంతుడు. ఈ గ్రంథమును ఇతడు వేణుగోపాలస్వామికి అంకితమిచ్చిరి.
  • శ్రీత్యాగరాజుపై భక్తితో ఖరహరప్రియ రాగములో “త్యాగరాజ సద్గురుని తలతును ప్రేమతో” అను కీర్తనను రచించిరి.
  • కాంభోజిరాగములోని “సరసిజనాభ” అను అటతాళ వర్ణములో ముక్తాయిస్వరము 3 ఆవృత్తములలో ఉన్నవని విద్వాంసులు ఆక్షేపింతురని తలచి, దానిని పూర్తిచేయుటకు దక్షిణదేశమంతటా అనేకమంది ప్రయత్నించగా, చివరకు ఈయనయే దానిని పూర్తిచేసి, స్వరసింహుడని బిరుదుపొంది, “స్వరసింహ త్యాగయ్యర్” అని పిలువబడిరి.
  • నెల్లూరు రాఘవరాజుగారు, గుంటూరు వాస్తవ్యులైన శంకరయ్యశాస్త్రిగారు ఈయన శిష్యులు.
  • 1900 సంవత్సరంలో తమ తండ్రిగారైన కుప్పయ్యర్ గారి రచనలన్నింటిని చేర్చి, “పల్లవి స్వరకల్పవల్లి” అను పేరిట అచ్చొత్తించినారు. ఇది సంగీత ప్రపంచమునకు అఖండమైన సేవ.
  • వీరు తమ రచనలను సంకీర్తన రత్నావళిలో ముద్రించియున్నారు. వీరి ముద్ర “గోపాలదేవ” అనునది.

Life History of Sri Patnam Subramanya Iyer - జీవితచరిత్ర - పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్

  • ఇతడు క్రీ.శ. 1845 - 1902 కాలమునాటివాడు. అష్టసహస్ర బ్రాహ్మణుడు. ఆంధ్రతమిళభాషలలోను, సంగీతములోను గొప్ప పండితుడు.
  • మానంబుచావడి వెంకటసుబ్బయ్యగారి శిష్యుడు.
  • ఈయన గాత్రము మొదట అతికఠినముగా ఉండుటచే విపరీతమైన సాధన చేసి, తన గాత్రమును మాధుర్యమైనదిగా చేసుకొనగలిగిన సంకల్పసిద్ధుడు.
  • ఇతను త్యాగరాజ రచనలను అనుసరించి, “వేంకటేశ” ముద్రతో అనేక కృతులను, వర్ణములను, తిల్లానాలను, జావళీలను రచించిన సమర్ధుడు.
  • బేగడ రాగాలాపనలో ఈయనకుగల ప్రత్యేక నైపుణ్యమునకుగాను “బేగడ సుబ్రహ్మణ్య అయ్యర్” అని పిలువబడును.
  • అష్టోత్తర శత తాళములలో ఒకటైన 128 అక్షరకాలములుగల “సింహనందిని” తాళములో ఒక గొప్ప పల్లవి రచించి అత్యద్భుతంగా గానముచేసి, సభాసదులను ఆనందపరవశులుగా చేయగల ఏకైక సంగీతవిద్వాంసుడు.
  • ఇతడు మొదట తిరువత్తియూర్ లోను, తదుపరి చెన్నపట్టణంలోను నివసించుటచే పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ అని కూడా పిలువబడెను.
  • ఇతని రచనలకుగానీ, గానమునకుగానీ, రాగభావమే ప్రత్యేకత అగును.
  • ఈయన రచనలలో
  • “ఇంతకంటె” (కానడ),
  • “రఘువంశసుధాంబుధిచంద్రశ్రీ” (కదనకుతూహలం),
  • “మనసున నెర నమ్మితిని” (బేగడ),
  • “నిన్నుజూసి ధన్యుడనైతి” (సౌరాష్ట్ర)
  • వంటి కృతులు మిగుల ప్రసిద్ధములు.
  • శ్రీ రామ్నాడ్ శ్రీనివాస అయ్యంగార్ ఈయనకు శిష్యుడు.

Life History of Sri Veena Kuppaiyer - జీవితచరిత్ర - వీణ కుప్పయ్యర్

    • ఇతడు 18-19 శతాబ్దములకు చెందినవారు. త్యాగరాజుకు ముఖ్యశిష్యుడు. తమిళబ్రాహ్మణుడు.

    • మద్రాసులోని తిరువత్తియూర్ నందు జన్మించెను. కనుక “తిరువత్తియూర్ కుప్పయ్యార్” అని పిలువబడును.

    • నారాయణగౌళ రాగాలాపనలో విశేష ప్రతిభగలవాడగుటచే, “నారాయణగౌళ కుప్పయ్యర్” అనియు, “పాట కుప్పయ్యర్” అనియు చెప్పుకొనెడివారు.

    • తండ్రిపేరు సాంబమూర్తిశాస్త్రి. ఈయన వీణ వాయిద్యములో అత్యద్బుతమైన ప్రతిభగలవాడగుటచే, “సాంబడు వాయించాలి, సాంబడే (ఈశ్వరుడే) వినాలి” అని ప్రజలు చెప్పుకొనేవారు.

    • కుప్పయ్యర్ సంగీతసాహిత్యములలో గొప్పపండితుడు కావున, కవియగును. ఇతడు రచించిన తానవర్ణములు, కృతులు, తిల్లానాలు విశేష ప్రచారములోకి వచ్చినవి.

    • ఇవి “గోపాలదాస” ముద్రను కలిగియుండును. ఇతనికి “గానచక్రవర్తి” అను ప్రసిద్ధ బిరుదు కలదు.

    • ఈయన శిష్యులలో పల్లవి సీతారామయ్య, ఫిడేల్ పొన్నుస్వామి మొదలగువారు ముఖ్యులు.

    • వీరు గొప్ప భక్తులు. వీరి కులదైవము శ్రీరాధారుక్మిణీసమేతుడైన శ్రీవేణుగోపాలస్వామి. ప్రతిదినము స్వామికి పూజలు చేయుటయు, సంవత్సరమునకు రెండుసార్లు ఉత్సవము జరుపుటయు వీని అలవాటు. ఉత్సవసమయమందు గొప్పగొప్ప విద్వాంసుల గానసభలు జరుగుచుండెడివి. ఈ కచేరీలు వినుటకు, పూజను చూచుటకు వేలాదిమంది జనులు వచ్చుచుండిరి.

    • అటువంటి సందర్భంలోనే శ్రీత్యాగరాజస్వామివారు ఒకసారి కుప్పయ్యగారి ఇంటినుండుట తటస్థించి, వేణుగోపాలస్వామివారి దివ్యవిగ్రహమునుగాంచి, తన్మయత్వమును పొంది, కేదారగౌళరాగంలో “వేణుగానలోలుని గన వేయికన్నులు కావలెనే” అను కృతిని పాడిరి.

    • కుప్పయ్యగారికి వేణుగోపాలునిమీద అమితభక్తి కలదు కనుక, “గోపాలదాస” అను ముద్ర తన రచనలలో వాడిరి.

    • వీరియొక్క కుమారుడు శ్రీ తిరువత్తియూర్ త్యాగయ్యగారు కూడా వాగ్గేయకారుడే.

    • వీణకుప్పయ్యర్ వర్ణములు, కృతులు, తిల్లానాలు రచించియున్నారు. వీరు తానవర్ణ రచనలలో చాలా నిపుణత కలవారు.

    • వీరు 1917 లో పరమపదించిరి.