పురందరదాసు 1486 - 1564 కాలంనాటివారు. ఈయన 1486వ సంవత్సరంలో బళ్ళారి జిల్లాలో హంపి వద్ద పురందరగడ అనే గ్రామంలో జన్మించిరి. కర్ణాటక బ్రాహ్మణుడు, మధ్వ మతస్తుడు. తండ్రి వరదప్ప, తల్లి కమలాంబ.
పురందరదాసు భార్య పేరు సరస్వతీబాయి. ఈయన మొదట పూనా నగరంలోను, తరువాత హంపి, విజయనగరంలోను నివసించినారు.
అన్నమాచార్యునికన్నా చిన్నవారు. వీరు ఉభయులూ సమావేశమైనట్టు కూడా చెప్పుదురు.
ఇతడు పండరీనాథుని భక్తుడై తన ఆస్తినంతయు దానధర్మములకు ఉపయోగించిన గొప్ప త్యాగఘనుడు.
వేదోపనిషత్తులను ప్రజలకు బోధించిన చరితార్థుడు.
కన్నడ భాషలో విశేష పాండిత్యం సంపాదించి భక్తితో 4,75,000 దేవరనామములను రచించి, తరించిన మహానుభావుడు.
కర్ణాటక సంగీతము ప్రారంభ శిక్షణకు వీలుగా స్వరావళి, జంట, అలంకార, పిళ్ళారిగీతములను రచించెను.
ఆదిగురువు మరియు సూళాదులను ఠాయములవంటి ప్రబంధములను రచించిన మేధాసంపన్నుడు.
వేదాంత ప్రబోధములైన ఇతని రచనలను కన్నడభాషలో దాసరపదగళు అని చెప్పుదురు.
వీరి రచనలు “పురంధరవిఠల” ముద్రను కలిగియుండును.
స్వరావళిని మాయామాళవగౌళ రాగములో బోధించుట ఇతడే ప్రారంభించెను.
ఇతనికి “కర్ణాటక సంగీత పితామహ” అని బిరుదు కలదు. ఇతని కుటుంబంలోని వారందరూ సంకీర్తన రచయితలగుదురు.
కథ: ఇతడు తల్లిదండ్రులయొక్క ఏకైక పుత్రుడు. తిరుపతి వేంకటేశ్వరుని మొక్కుపై జన్మించెను. వీరు చాలా ధనవంతులు అయినందువల్ల వరదప్పను “నాయక్” అని పిలిచేవారు. వేంకటేశ్వరుని అనుగ్రహంవల్ల జన్మించారు కాబట్టి ఇతనికి శ్రీనివాసుడు అని పేరు పెట్టిరి.
శ్రీనివాసుడు చిన్నతనంలోనే సంస్కృతం, కన్నడ భాషల్లోను, సంగీతం మొదలైనవాటిలో మేటి అయిరి. వజ్రములు పరీక్షించుటలో కూడా ప్రావీణ్యము సంపాదించిరి. ఇతనికి సరస్వతీబాయి అను బాలికతో 16వ ఏట వివాహం జరిగినది. ఇతని 20వ ఏట తల్లిదండ్రులు కరువైరి కనుక వ్యాపారభారమంతయు ఇతనిపై పడినది. అతిచతురతతో వ్యాపారం చేసి, ధనమును బాగుగా గడించిరి. వీరి సహవ్యాపారస్తులు వీరిని “నవకేటి నారాయణ” అని పిలిచేవారు. కానీ లోభత్వం కూడా వీరిలో పెరిగెను.
ఒకనాడు శ్రీనివాసుని వద్దకు ఒక బ్రాహ్మణుడు తన కుమారునికి ఉపనయనం చేయవలయుననియు, అందులకు కొంత సహాయము చేయవలయుననిను అర్థించెను. శ్రీనివాసుడు రేపు రమ్మని చెప్పెను. ఇట్లు కొన్ని దినములు బ్రాహ్మణుడు వచ్చుటయు, ఇదే బదులు చెప్పుటయు జరిగెను. ఆ బ్రాహ్మణుడు విసిగి, శ్రీనివాసుని భార్య అయిన సరస్వతీబాయి వద్దకు వెళ్లి సహాయం చేయమని కోరెను. ఆమె మిక్కిలి భక్తి కలిగినది, నిష్ఠాపరురాలు. ఉపనయనం కొరకు వచ్చి సహాయం అడిగిన కాదనకూడదని తెలిసి, వెంటనే తన ముక్కున ఉన్న ముంగెరును తీసిచ్చి దానిని అమ్మి ఖర్చు చేసుకోమనెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు దానిని తీసుకొని శ్రీనివాసుని వద్దకు అమ్ముటకై వెళ్ళెను. ఆ నగను చూసిన వెంటనే అది తన భార్యదే అని గుర్తించెను. వెంటనే తన ఇంటికి వెళ్లి భార్య ముంగెరను అడిగెను. సరస్వతీబాయి భయపడి, బ్రతుకుటకంటే చావు మేలని విషము కలుపుకొని తాగబోయెను. కానీ ఆ పాత్రలో తన ముంగెర కనబడగా దానిని తీసుకొనిపోయి దానిని తన భర్తకు ఇచ్చెను. ఆ నగను చూసి శ్రీనివాసుడు ఆశ్చర్యపోయి తన భార్యవలన జరిగిన విషయము వినిన వెంటనే అతనికి జ్ఞానోదయము కలిగెను. వెంటనే ఆ బ్రాహ్మణుడికోసం వెతికించగా అతను కానరాలేదు. ఆ బ్రాహ్మణుడే పరమపురుషుడగు విఠలస్వామి అని తెలుసుకొని తన సర్వస్వము దానధర్మములకు వినియోగించెను. ఆ సమయములో అఠాణ రాగంలో మొదటి కీర్తన రచించిరి.
జ్ఞానోదయం అయినప్పటినుండి ఇతడు దేశములోని అన్ని క్షేత్రములను దర్శించెను. ప్రసిద్ధ మధ్వగురువు అయిన వ్యాసతీర్థులవారు వీరికి ఉపదేశము చేసి “పురంధరదాసు” అని పేరు పెట్టిరి. ఈ భార్యాభర్తల భక్తికి మెచ్చి పురంధర విఠలుడు చాలాసార్లు దర్శనమిచ్చిరి.
వీరు నారదాంశము అని ప్రతీతి. శ్రీ త్యాగయ్యగారు వీరికి చాలా కృతులలో అంజలి ఘటించిరి. మధ్యమకాల రచనలలో నాయికానాయకుల భావములతో కొన్ని రచనలు వీరిచే రచింపబడినవి. వీరు గీతములను, ద్విధాతు ప్రబంధములను రచించిరి. వీరు హంపిలో నివసించిన మఠమునకు “పురంధరదాసు మఠము” అని పేరు. ఆ మఠము ఇప్పటికీ హంపిలో కలదు. ఈయన చివరి దశలో సన్యాసమును స్వీకరించిరి. రక్తాక్షి నామ సంవత్సరము పుష్య బహుళ అమావాస్య అనగా 1564 జనవరి 2వ తేదీన సిద్ధిపొందిరి.
No comments:
Post a Comment